తెలుగు సినిమా చరిత్రలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో ఒక ట్రాక్‌కి మాత్రమే పరిమితమైన హాస్యం రేంజ్‌ని పెంచి పూర్తి స్థాయి హాస్య చిత్రాలకు శ్రీకారం చుట్టిన దర్శకుల్లో జంధ్యాల, రేలంగి నరసింహారావులను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ, వంశీ వంటి దర్శకులు కూడా కామెడీనే ప్రధానాంశంగా తీసుకొని సినిమాలు రూపొందించారు. రేలంగి నరసింహారావు విషయానికి వస్తే రాజేంద్రప్రసాద్‌తో 32, చంద్రమోహన్‌తో 24 కామెడీ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. సాధారణంగా కామెడీని బాగా చూపించే దర్శకుల్లో సెన్సాఫ్ హ్యూమర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వారి దైనందిన జీవితంలో కొన్ని హాస్య సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అలాంటి ఓ విచిత్రమైన సన్నివేశం రేలంగి నరసింహారావు జీవితంలో జరిగింది. దాని గురించి ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
‘డైరెక్టర్‌గా అప్పుడే ఎదుగుతున్న రోజులవి. ఓ సినిమా కోసం ఓ ప్రొడ్యూసర్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన మెంటాలిటీ చాలా విచిత్రంగా ఉండేది. అతనితో నాకు ఎదురైన ఓ సరదా సంఘటన గురించి చెబుతాను. ఓ రోజు ఉదయం నేను స్నానానికి వెళ్దామని రెడీ అవుతుండగా.. బయటి నుంచి డైరెక్టర్‌గారూ అంటే గట్టిగా ఓ కేక వినిపించింది. అంత ఉదయమే వచ్చిందెవరా అని ముందు గదిలోకి వచ్చాను. నాతో సినిమా ఓకే చేసుకున్న నిర్మాత కనిపించారు. సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ని, హీరోని కాకా పడితే ఇంకా బాగా తీస్తారని ఎవరో చెబితే దాన్ని ఫాలో అవుతూ నన్ను కాకా పట్టే పనిలోనే వుండేవారాయన. ఓసారి ఇంటిని పరిశీలనగా చూసి ‘డైరెక్టర్‌గారూ, మీ ఇంట్లో ఏసీ లేదా?’ అని అడిగారు. ‘లేదండీ’ అని చెప్పాను. ‘భలేవారే.. మీలాంటి క్రియేటివ్ పర్సన్స్‌కి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మీ బుర్ర వేడెక్కిపోతుంది. ఇంట్లో ఏసీ కంపల్సరీ ఉండాలి’ అంటూ ‘ఒరేయ్ ఆఫీస్‌లోని బీరువాలో 18 వేలు వుంటాయి. అవి తీసుకొని వెళ్లి ఒక విండో ఏసీ తీసుకురా’ అంటూ తన మనిషిని పురమాయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత పాండీ బజార్ నుంచి మనిషిని తీసుకొచ్చి ఏసీ పెట్టడానికి వీలుగా పెద్ద హోల్ చేయించి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వ్యక్తి రాత్రయినా రాలేదు. నాకు ఏం చెయ్యాలో తోచక ఆ హోల్‌కి బీరువా అడ్డం పెట్టి మేము అక్కడే పడుకున్నాము. మరుసటి రోజు ఉదయం పిల్లల్ని స్కూల్‌కి వెళ్లొదని చెప్పి ఆ హోల్ దగ్గరే కూర్చొని ఆడుకోమని చెప్పి నేను నిర్మాత వెంకన్నబాబుగారి ఆఫీస్‌కి వెళ్లాను. భలేమొగుడు స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మాటల సందర్భంలో ఆ ప్రొడ్యూసర్ ఇలా చేశారని చెప్పాను. ‘అతనో డబ్బా ప్రొడ్యూసరండీ. ఎందుకండీ అతని మాటలు నమ్మి ఇంటికి హోల్ చేయించారు. పైగా అది అద్దె ఇల్లు. సరేలేండి. జరిగిందేదో జరిగిపోయింది’ అన్నారు వెంకన్నబాబు. ఆ తర్వాత వేరే సినిమా ఆఫీస్‌లో పనులు చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఏసీ ఫిక్స్ చేస్తున్నారు. అది చూసి నేను గిల్టీగా ఫీల్ అయ్యాను. అనవసరంగా ప్రొడ్యూసర్ని అపార్థం చేసుకున్నాను. వెంకన్నబాబుగారితో కూడా తిట్టించాను. మహానుభావుడు ఏసీ పంపించారు’ అన్నాను. దానికి మా ఆవిడ ‘మీరు భలేవారే.. వెంకన్నబాబుగారు ఈ ఏసీ పంపించారు’ అని చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.
`ఆ మరుసటిరోజు మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ ఉదయమే వచ్చారు. ‘ఏమిటీ.. ఏసీ ఫిక్స్ చేయించినట్టున్నారు’ అన్నారు. ‘అవును సార్.. వెంకన్నబాబుగారు పంపించారు’ అని చెప్పాను. ‘నిన్న మంచి కంపెనీ లేవన్నారు. అందుకే ఈరోజు మంచిది తెప్పిస్తున్నాను. సరే ఎలాగూ ఏసీ వచ్చేసింది కదా. దాన్ని వెనక్కి పంపించేస్తాను’ అన్నారు. వచ్చిన నిర్మాతకు మర్యాదలు చెయ్యాలి కదా అని కూర్చోమని చెప్పాను. మేం కాఫీ తాగుతున్నాం. ఆ సమయంలోనే మా పనిమనిషి బట్టలు ఉతికేందుకు తీసుకెళ్తోంది. ఆమెనే తదేకంగా చూస్తున్నారాయన. అదేమిటి పనిమనిషిని అలా చూస్తున్నారు అసహ్యంగా అనుకున్నాను. ఉన్నట్టుండి ‘నరసింహారావుగారూ.. మీ ఇంట్లో వాషింగ్ మెషీన్ లేదా?’ అన్నారు. నేను ఒక్కసారిగా ఆయన కాళ్ళమీద పడిపోయి ‘అయ్యా.. మీకు దండం పెడతాను. నాకు వాషింగ్ మెషీన్ వద్దు’ అని ప్రాధేయపడ్డాను. అప్పటికే ఏసీ పేరుతో ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాషింగ్ మెషీన్ విషయంలో ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని అలా చేశాను. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకు నిత్య జీవితంలో ఎన్నో ఎదురవుతుంటాయి. ఈ క్యారెక్టర్ సినిమాల్లో బాగా పండుతుంది. బ్రహ్మానందంగారు కలిసినప్పుడల్లా ఆ క్యారెక్టర్ని ఎక్స్టెండ్ చేసి కొన్ని సీన్లతో చేస్తే జనం బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్తుంటారు. కానీ, దాన్ని ఇంతవరకు ఏ సినిమాలోనూ పెట్టలేదు. ఇది నా లైఫ్‌లో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్’ అంటూ వివరించారు రేలంగి నరసింహారావు.